Sunday 8 April 2018

రాజకీయ రంగస్థలం!

రాజకీయమంటేనే అరాచకీయం. ఆ అరాచకీయాన్ని అద్భుతమైన ఆదర్శాల పేరు చెప్పి మరింత అపసవ్యంగా ఆవిష్కరించి, వికారంగా తీర్చిదిద్దేవాడు నాయకుడు. ఎన్నికల గాడిపొయ్యి మీద డేకీసాలో రాజకీయాన్ని పోసి, సీట్లతో మంటపెట్టి, ఓట్లతో కలబెట్టి, హామీల పోపు పెట్టి, కులమనే వెల్లుల్లిని ఫుల్లుగా దట్టించి, మతమనే మసాలాను ఘాటుగా పట్టించి, బాగా ఉడకనిచ్చి వేడివేడిగా వడ్డిస్తే ఉంటుంది చూశారూ ఆ మజా.. అధికారం నషాళానికి అర అంగుళం దూరంలో ఆగి కనిపిస్తుంది. దాంతోపాటు పక్కన నంజుకోవడానికి పచ్చ నోట్లు, పుంజుకోవడానికి పచ్చటి సీసాలు ఉంటే సొర్గం మన ముందట తడబడుతూ నిలబడ్డట్టే! ఐదేళ్లకోసారి పండక్కి మాత్రమే దొరికే ఈ స్పెషల్‌డిష్‌ తినేవాడికి ఇంపు. చూసేవాడికి కంపు!

రాజకీయాన్ని వండడం అంత తేలికేం కాదు. ఏమీ తెలియనట్టే కుట్రలు పన్నగలిగిన అమాయకత్వం... పైకి తెచ్చిన వాడినే వెన్నుపోటు పొడవగల అకుంఠిత విధేయత... జాతికి జరిగే నష్టాన్ని కూడా పట్టించుకోనంత నిస్వార్థపరత... దేశం నాశనమైపోయినా లెక్కచేయనంత దేశభక్తి... అనునిత్యం అతికినట్టు అబద్ధాలు చెప్పగలిగే నిజాయతీ... నిన్న సాయంవేళ ఇచ్చిన మాటను ఇవాళ పొద్దున్నే మరచిపోగలిగేంత జ్ఞాపకశక్తి... సిగ్గులేకుండా ఆత్మస్తుతి పరనింద చేయగల నిష్పాక్షికత... ధనికుల కోసం మాత్రమే ఆలోచించేంత దారిద్య్ర నిబద్ధత... బేవార్సు విధానాలకు భేషుగ్గా భాష్యం చెప్పగల సైద్ధాంతిక చతురత.. కుర్చీ కోసం ఇటు నుంచి ఎటైనా దుంకగల అ–చంచలత... ఇవన్నీ ఉన్నవాడే రాజకీయాన్ని రుచిగా వండి వార్చగలడు!!

కుల రహిత సమాజం కోసం కులతత్వాన్ని పెంచి పోషించగలిగే మహా నిబద్ధత... మతాతీత దేశం కోసం మారణహోమాన్ని రెచ్చగొట్టగలిగే లౌకికత ఉండడం అదనపు అర్హత. భూమి తనచుట్టూ తాను భ్రమణం చేస్తూ, సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చేస్తుందట. కానీ మన నాయకుల ఫలితమా అని భారతదేశం కులం చుట్టూ భ్రమిస్తూ, మతం చుట్టూ పరిభ్రమిస్తోంది. కాలం గడిచేకొద్దీ కులం– మతం కాలగతిలో కలసిపోవడానికి బదులు కల్లోలమే సృష్టిస్తున్నాయి.

ఓట్ల కోసం, సీట్లకోసం నేతలు ఇప్పటిదాకా ప్రజలను కులాలు, మతాలు వారీగా మాత్రమే చీల్చారు. కులాలను, మతాలను కూడా చీల్చేయడం ఇప్పుడు మొదలైంది.

హిందువుల్ని కులాలుగా విడగొట్టి, ముస్లింలను మతంగా కొల్లగొట్టి, లౌక్యంగా గెలవడం నేర్చుకున్నాయి లౌకికవాద పార్టీలు. హిందువుల్ని మతంతో ఏకం చేసి, ముస్లిముల్లో సున్నీ, షియా, తలాఖ్‌ల తకరారు పెట్టి ‘అమిత’ చాతుర్యం చూపారు బీజేపీ వారు. దీనికి దీటుగా, పోటీగా ఇప్పుడు ఏకంగా హిందూ మతాన్నే ముక్కచెక్కలు చేయడానికి లెక్కలేశారు కాంగ్రెస్‌వారు.

ఓట్లొస్తే చాలు, సీట్లొస్తే చాలు, కుర్చీలో దర్జాగా కొలువుదీరితే చాలు! కాకి వాలిన కారులో కూర్చోవడమే నచ్చని పరమ హేతువాది... మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం చేసి కూడా, మంత్రించిన నిమ్మకాయ చేతిలో ఉంటే తప్ప ప్రచారం చేయలేని నిష్ఠా గరిష్ఠుడు... దేవుడిని కొలిచే మఠాధిపతులను తప్ప దేవుళ్లను నమ్మని నాస్తిక శిఖామణి ఇప్పుడు.. మోడీని పడగొట్టేందుకు తొడగొడుతున్న దేశ రాజకీయ యోధులకు ఆదర్శప్రాయుడు! కర్ణాటకను గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తూ, సిద్దూ [సిధ్ధరామయ్య] ప్రయోగాన్ని, ఫలితాన్ని చూసి అదే మార్గంలో పయనించాలని దేశంలోని నేతలంతా తహతహలాడుతున్నారు! భశుం!!

చివరాఖరు: గోరఖ్‌పూర్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత, పార్లమెంటు సెంట్రల్‌హాల్లో ప్రతిపక్ష ఎంపీలంతా, మోదీ నిరాదరణకు గురైన బీజేపీ అగ్రనేత మురళీమనోహర్‌ జోషికి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారట. ఆయన కూడా మందహాసంతో వాటిని స్వీకరించారట. ఇదంతా చూస్తున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌... జోషి వద్దకు వచ్చి ‘మీరిలా చేయడం ఏమీ బాగాలేదు. తప్పుడు సంకేతాలు వెళతాయి’ అన్నారట. ‘నేను ఎప్పుడేం చేయాలో చెప్పేంత వాడివయ్యావా నువ్వు’ అని గద్దించారట జోషి. మోదీ మీద విపక్షీయులకే కాదు; స్వపక్షీయులకూ ఎంత కోపం ఉందో ఇంతకుమించి చెప్పాలా?




No comments:

Post a Comment